(అ)భాగ్యనగరంలో ద్విచక్రవాహన చోదన - ఒక సామాజిక పరిశీలన

ముందుగా భాగ్యనగరంలో వాహనం నడపటానికి కావలసిన అర్హతలు:
1. డ్రైవింగ్ రూల్స్ బాగా తెలిసుండాలి. దీనివల్ల ఏది రాంగ్ రూటో, ఏది కరెక్ట్ రూటో తెలుస్తుంది. ఎలాగూ జనాలు ఎక్కువగా రాంగ్ రూట్‌లోనే వెళతారు కాబట్టి మనం జాగ్రత్తపడొచ్చన్నమాట.

2. డ్రైవింగ్ లైసెన్స్, బండి రిజిష్ట్రేషన్ వగైరా ఉన్నా లేకున్నా ఓ యాభై రూపాయిలు మన దగ్గర ఉండాలి. దీనివల్ల మీ సమయం ఆదా అవుతుంది మరియు ఏ టెన్షన్ లేకుండా వెళ్ళొచ్చన్నమాట.

3. హిందీ బాగా వచ్చి ఉండాలి. మనం వేరేవాడికి డాష్ ఇచ్చినా వేరేవాడు మనకి డాష్ ఇచ్చినా మీ వాగ్ధాటికి పని చెప్పొచ్చన్నమాట.

4. ఫ్రతీరోజూ క్రమం తప్పకుండా మనకు నచ్చిన పత్రికలో వారఫలాలు చూసుకుంటూ ఉండాలి. నాస్తికులైతే   ప్రక్కవాళ్ళను చూసి చెప్పమనాలి.

5. ఇక ఆటోలకి ఎంతదూరం ఉంటే మీ ఆరోగ్యానికి అంతమంచిదన్నమాట. ISO  స్టాండార్డ్ 108 ప్రకారం ఆటోలకి కనీసం 25 అడుగుల దూరం పాటించాలి. ఇది ఆటోకి ముందూ, వెనుకా, ప్రక్కన ఇలా అన్నివేపులకీ వర్తిస్తుందన్నమాట.

ఇక ద్విచక్రవాహనం నడపటం వలన కలిగే లాభనష్టాలు:
1. మనకి ముందుచూపు బాగా పెరుగుతుంది - ఒక్క ముందుచూపేం ఖర్మ, ప్రక్కచూపు  వెనకచూపుకూడా పెరుగుతాయి. మరి ఎవడు ఎటొస్తాడో తెలియదుకదా.

2. వార్ధక్యంలో వచ్చే ఏ వ్యాధులూ మనల్ని బాధించవు - ఆలోపుగానే మనం టపా కట్టేస్తాం కదా మరి.

3. గవర్నుమెంటు ఆఫీసులముందు గంటలతరబడీ వెయిట్ చేసే శక్తి వస్తుంది -  JNTU సిగ్నల్ దాటి వెళ్ళేవాళ్ళకి ఈ  కాన్సెప్ట్ బాగా అర్ధం అవుతుంది.

4. తోటి మానవులపట్ల జాలి, దయ, కరుణ వగైరా పెరుగుతాయి - ట్రాఫిక్‌జాం లో ఇరుక్కున్న కారులో వెళ్ళేవాళ్ళను      చూస్తే.

5. ఆఫీసుకి ఆలస్యంగా వెళ్ళినా బాసుకి ట్రాఫిక్‌జాం అని చెప్పొచ్చు.

6. మానవ జీవితం క్షణికం, కడుదుర్భరం లాంటి తత్వాలు బాగా బోధపడతాయి.



ఆర్చిడ్స్




ప్రవాసం లో ఓ రోజున నేను లండన్ వెళ్ళినప్పుడు నా అదృష్టం కొద్దీ ఓ ఆర్చిడ్ షో జరిగింది. ఇక కోతికి కొబ్బరి చిప్ప దొరికినట్టు, అప్పుడే కొత్తగా కొన్నానేమో, ఇక నా Nikon D90 కెమెరా తో కుమ్మేసా. రెండు గంటల సేపు నాకు ప్రపంచం కనిపించలేదు. Nikon VR (Vibration reduction) lens పుణ్యమా అని 105mm focal length లో కూడాఫోటోలు అన్నీ చాలా స్పష్టంగా వచ్చాయి.

సాంకేతిక వివరాలు:
Lens: Nikon 18-105mm VR
Focal Length: 62 to 105 mm
Aperture: F/5.6
Shutter speed: 1/50 sec
Metering: Spot metering
ISO sensitivity: ISO-200

ఈ చందమామలో మీకేమి కనిపిస్తోంది ... ?


సాంకేతిక వివరాలు:
Camera: Nikon D90
Lens: Tamron 70-300 mm zoom lens
Focal Length: 300 mm
Aperture: F/9
Shutter speed: 1/400 sec
Metering: Spot metering
ISO sensitivity: ISO-400

tripod లేకుండా కెమెరాని చేతితో పట్టుకుని తీసా. ఒక సాధారణ జూమ్ లెన్స్ తో చంద్రుణ్ణి ఇంత దగ్గరగా తీయడం మాత్రం నాకు గొప్ప ఆనందాన్నిచ్చింది.

వర్డుప్రెస్సు నుండి బ్లాగరుకి పయనం

ముందుగా ఓ మాట... నా వర్డుప్రెస్సు బ్లాగు (http://sashanka.wordpress.com) ఇక్కడికి మారింది.

అసలు నేను వర్డుప్రెస్సు నుండి బ్లాగరుకి ఎందుకు మారవలసివచ్చిందంటే:

1. బ్లాగరు గూగులోడి సర్వీసు.
2. మిగతా గూగుల్ సర్వీసులనుండి బ్లాగరుకి మంచి సదుపాయాలు ఉన్నాయి.
3. వర్డుప్రెస్సు లో టెంప్లేట్ ని మనకి నచ్చిన విధంగా మార్చాలంటే డబ్బులు చెల్లించాలి. బ్లాగరు పూర్తిగా ఉచితం.
4. బ్లాగరు లో ఐతే బోలెడు ప్రయోగాలు చేయవచ్చు.
5. ఈమధ్య వర్డుప్రెస్సోళ్ళు బ్లాగుల్లో యాడ్ లు కూడా పెడతామంటున్నారు.

కానీ ఏమాటకి ఆ మాటే చెప్పుకోవాలి. బుద్ధిగా ఏ ప్రయోగాలు చేయకుండా బ్లాగు రాసుకొనేవాళ్ళకు వర్డుప్రెస్సే ఉత్తమం

ఇక నా వర్డుప్రెస్స్ బ్లాగులోని టపాలను బ్లాగరులోకి మార్చడానికి (Comments ని కూడా Export చేయడానికి) చాలా పరిశోధనలు చేయవలసివచ్చింది. గూగులోడిని తగలెయ్య, 'వర్డుప్రెస్సు నుండి బ్లాగరుకు' మారడం ఎలా అని సెర్చ్ చేస్తే సెర్చ్ రిసల్ట్ లో అన్ని లింకులు 'బ్లాగరు నుండి వర్డుప్రెస్సుకి' మారడం మీదే వచ్చాయి. అప్పుడు అర్ధమైంది నాకు ఎక్కువమంది బ్లాగరు నుండి వర్డుప్రెస్సుకి మారతారని.

చివరకి కొన్ని లింకులు దొరికాయి (blogsyn0.3, blog2blog, blogSyncV1.1, wxr2blogger). ఏ Installation అవసరం లేకుండా online లో టపాలు Export చేయాలంటే blogSyncV1.1 ని ఉపయోగించవచ్చు. blogsyn0.3 లో Comments కూడా Export చెయ్యొచ్చన్నాడు కానీ Comments Export కాలేదు. బహుశా Google Blogger Data API మారడం వల్లనేమో.

ఇంతాచేసి చివరికి Comments ని మాత్రం Export చేయలేకపోయాను.

వైరస్ లను నిరోధించే సులువైన మార్గం

మధ్య ఎక్కువ శాతం వైరస్ లు పెన్ డ్రైవ్ ల ద్వారానే వస్తున్నాయి. సిస్టం లో ఆటోరన్ ని నిలిపివేయుటద్వారా ఇలా వచ్చేవాటిని నిరోధించవచ్చు. దీనికోసం 'Group policy' లో ఈ క్రింద చూపినట్టు కొన్ని మార్పులు చేయాలి.
Go to Start > RUN command > in RUN command give   gpedit.msc  >  press OK

ఇప్పుడు 'Group policy' విండో ఓపెన్ అవుతుంది. ఈ క్రింద చూపినట్టు 'User Configuration' ని మార్చాలి.

ఇలా CD ల నుండి ఆటోరన్ ద్వారా వ్యాపించే వైరస్ లను కూడా ఆపవచ్చు. కానీ ఇలా ఆటోరన్ ని నిలిపివేయడం వలన CD లు ఆటోమాటిక్ గా ఓపెన్ కావు.  ఏదైనా మృదులాంతరాన్ని (software) ఆటోమాటిక్ గా స్థాపించాలంటే (install చేయాలంటే) CD  డ్రైవ్ మీద 'Right click' చేసి  'Auto play' ని క్లిక్ చేస్తే సరిపోతుంది.

చాలామంది కాపీ చేసే తొందరలో ఫోల్డర్ పేరుని మార్చరు. "New folder" పేరుతోనే ఫోల్డర్ ఉండిపోతుంది. దీనిని ఆసరాగా తీసుకుని ఈమధ్య "New folder.exe" అనే వైరస్ బాగా వ్యాపిస్తున్నది. వైరస్ "New folder" పేరుతో కాపీ అవుతుంది. మనకు తెలియక మనం కాపీ చేసిన ఫోల్డరే కదా అని క్లిక్ చేస్తాం. అంతే సంగతులు !!. సాధ్యమైనంతవరకు ఫోల్డర్స్ కి అర్ధవంతమైన పేర్లు ఇవ్వడం మంచిది. దీనివల్ల మనకు తెలియని పేరుతో ఏదైనా వైరస్ కాపీ ఐనా ఇట్టే తెలిసిపోతుంది. ఒకవేళ వైరస్ 'Hidden' గా ఉంటే ఎలాగూ ఆటోరన్ నిలిపివేయబడింది కాబట్టి దానితో మనకి ప్రమాదం లేదు.

నాకు తెలిసిన చలం

గొప్పగా అలోచించే వాళ్ళలో ఓ రకమైన విశ్రుంఖలత్వం వుంటుంది. వీళ్ళు ముఖ్యంగా మన సనాతన ధర్మాలని ప్రశ్నిస్తారు. కానీ వీళ్ళ వాక్పటిమ ఎంతగా వుంటుందంటే, వీళ్ళు మన ఆచారాలను ప్రశ్నించినా అందులో ఏదో నిజం ఉందనుకుంటాం. ఇలాంటివాళ్ళు వితండవాదం చేసినా అది అభ్యుదయ భావాలుగల వాళ్ళకు నచ్చుతుంది. కానీ వీళ్ళని సాంప్రదాయవాదులు వ్యతిరేకిస్తారు, సరైన కారణం లేకపోయినా, ఎందుకంటే వీళ్ళ తర్కానికి వాళ్ళు సమాధానం చెప్పలేరు. ఈ అభ్యుదయ భావాలు గల వాళ్ళు (వీళ్ళలో ఓ వర్గమే ఈ హేతువాదులు) ఇలాంటి వాళ్ళకోసమే ఎదురు చూస్తుంటారు. వీళ్ళు చెప్పేది నిజమా కాదా అని ఆలోచించరు.

ఇలాంటి విశ్రుంఖలత్వం ఉన్నవాళ్ళలో చలం ఒకరని నాకు అనిపించింది. నేను సుజాత అనే ఒక కథ చదివాను (చలం వ్రాసింది). సుజాత భర్త గొప్ప స్వాతంత్ర్యవాది(ఇది బ్రిటిష్ కాలంలో జరిగిన కథ). సుజాత భర్త ఆమెని చాలా ప్రేమగా చూసుకుంటుంటాడు. ఐనా ఆమె ఓ పోలీస్ తో అక్రమసంబంధం పెట్టుకుంటుంది. భర్తకి జబ్బు చేస్తుంది. అప్పుడు ఆమెకి భర్త మీడ జాలి కలుగుతుంది. భర్తకి సేవ చేస్తూ ఉంటుంది. కానీ ఈ పోలీస్ దగ్గరికి వెళ్ళడం మాత్రం మానదు. చివరగా తన తప్పు తెలుసుకుంటుంది (తెలుసుకున్నట్టు అనిపిస్తుంది), ఎలా అంటే నా భర్తని ఈ స్థితిలో వుండగా నీతో రాలేను అంటుంది. మళ్ళీ పోలీస్ మీదే మనసు ఉంటుంది ఆమెకు. ఇది మామూలుగా ఎవరైనా చెబితే ఈమె శీలం లేనిది అనే భావన కలుగుతుంది. కాని ఈ కథను చలం మలచిన తీరు చూస్తే మనకు వేరే అభిప్రాయం కలుగుతుంది. అరె ఈమె భర్తకోసం ఎంత త్యాగం చేసింది అని అనుకుంటాం చివరకి. ఇది చలం నైపుణ్యము.

చలం ఆదర్శవాదులకు నచ్చుతాడు. ఎందుకంటే వీళ్ళు సామాజిక కట్టుబాట్లగురించి ఆలోచించరు. కేవలం ఆ వ్యక్తి కోణం నుంచి ఆలోచిస్తారు. ఈమెకి కోరిక కలిగింది కాబట్టి అతనితో వెళ్ళింది అని అనుకుంటారు. ఇక్కడ శీలం అన్న పదానికి విలువ లేదు. మనకు నచ్చింది మనం చేస్తాం అనే పద్దతిలో ఉంటారు. కాని కాస్త వాస్తవికతతో ఆలోచించే సాంప్రదాయవాదులు (వీళ్ళు, ఈమె తప్పుచేసింది అనే కోణంలో ఆలోచిస్తారు ) చలాన్ని వ్యతిరేకిస్తారు. ఈ గొప్పోళ్ళంతా ఏదో సమాజం పాడైపోయింది, మనమే దీన్ని ఉద్దరించాలి అని ఉన్న సాంప్రదాయాలకి భిన్నంగా రాస్తారు. ఇలాంటివారు కొన్ని సామాజిక కట్టుబాట్లు సహేతుకంగా లేకపొయినా, వీటిపట్ల వీళ్ళు మరీ అతిగా స్పందిస్తారు, పర్యవసానాలగురించి అలోచించకుండా.